Vijayawada: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వింటుంటే నాకు బాధేస్తోంది: నారా లోకేశ్
- ఉద్దానంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు దిగింది
- కుప్పంకు కేటాయించిన తాగునీటి ప్లాంట్లనూ ఉద్దానానికే ఇచ్చాం
- పద్ధతి ప్రకారం నడుచుకుంటున్న నాపై ఆరోపణలు చేస్తున్నారు
- నాపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసురుతున్నా
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే తనకు బాధేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయవాడలో రెండో రోజు మహానాడులో ఆయన మాట్లాడుతూ, ఉద్దానంపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు దిగిందని చెప్పారు. ఉద్దానంలో నీటిప్లాంట్లు ఏర్పాటు చేశామని, కుప్పంకు కేటాయించిన తాగునీటి ప్లాంట్లను కూడా ఉద్దానానికే ఇచ్చామని, పవన్ కల్యాణ్ ఈ విషయాలను గుర్తించాలని సూచించారు.
పద్ధతి ప్రకారం నడుచుకుంటుంటే విపక్ష పార్టీలు తనపై ఆరోపణలు చేస్తున్నాయని, తాను చేసిన తప్పులేంటో సాక్ష్యాలతో సహా నిరూపించాలని, అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. మహానాడు వేదికగా తాను సవాల్ విసురుతున్నానని, తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తన తాత, తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా ఎప్పుడూ వ్యవహరించనని, రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు 68 ఏళ్ల వయసులో ఎంతో కష్టపడుతున్నారని, టీడీపీ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపై ప్రతిపక్షాలు నడుస్తున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తే తిప్పి కొట్టే బాధ్యత తమపై ఉందని అన్నారు. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, తిరుమల వెంకన్నను రాజకీయాల్లోకి లాగుతున్నారని, వెంకన్న జోలికొస్తే ఎలా మాడిమసైపోతారో అందరికీ తెలుసని అన్నారు.