srikakulam: చంద్రబాబుగారూ, మీ జేబులోదో, ‘హెరిటేజ్’ డబ్బులో పెట్టక్కర్లేదు!: పవన్ కల్యాణ్
- కిడ్నీ బాధితుల కోసం మండలానికో డయాలిసిస్ కేంద్రం పెట్టాలి
- ప్రభుత్వ డబ్బే కదా!
- పాలకొండ, రాజాం నియోజకవర్గ కేంద్రాల్లో కవాతు
శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితుల కోసం మండలానికో డయాలిసిస్ కేంద్రం పెట్టాలని, అందుకు, చంద్రబాబు తన డబ్బులేమి ఖర్చు పెట్టక్కర్లేదని, ప్రభుత్వం డబ్బే కదా ఖర్చుపెట్టేదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పాలకొండ, రాజాం నియోజకవర్గ కేంద్రాల్లో కవాతు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘50 గ్రామాల ప్రజలు ఆముదాలవలస - రాజాంల మధ్య బలశాల దగ్గర వంతెన కావాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజాంలో ప్రభుత్వ కాలేజీ లేదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదు రాజాం అని కూడా గుర్తుపెట్టుకోండి.
మీ అవినీతిని ప్రశ్నించినందుకు 15 మంది జనసేన సైనికుల్ని జైళ్లలో పెట్టారు. గత ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తే చేసేది ఇదా? మీ అవినీతిని చూస్తూ సహించం... చొక్కాపట్టుకొని నిలదీస్తాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. ముఖ్యమంత్రి రాజీపడటం వల్ల, ఆయన కాంట్రాక్టుల కోసం రాజీపడటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండాపోయింది.
ఆ రోజు స్పెషల్ ప్యాకేజికి రాజీపడి ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకువచ్చారు. ఇదేనా, మీ 40 ఏళ్ల అనుభవం? శ్రీకాకుళం జిల్లాలో వెనకబాటుతనం ప్రజలకేగానీ రాజకీయ నాయకులు, వాళ్ల కుటుంబాలకి లేదు. ఈ జిల్లాకి ఎవరున్నా లేకపోయినా, టీడీపీ, వైసీపీ లేకున్నా - నేను, జనసేన అండగా ఉంటామని మాట ఇస్తున్నా. వంచనకు గురిచేస్తున్న నాయకులకి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయి. కిడ్నీ బాధితుల కోసం మండలానికో డయాలిసిస్ కేంద్రం పెట్టండి. వాటికి మీ జేబులో డబ్బులో, హెరిటేజ్ డబ్బులో పెట్టక్కర్లేదుగా!... ప్రభుత్వ డబ్బే కదా’ అని అన్నారు. గిరిజనులంటే ఓటు బ్యాంక్ కాదు!
‘పాలకొండ ప్రాంతంలోని రైతులు, గిరిజనులు వర్షాధారం మీదే పంటలు పండించుకొంటున్నారు. వారికి అవసరమైన రిజర్వాయర్లు కట్టించలేరా? గిరిజన గ్రామాలకి ఇప్పటికి సరైన దారులు లేవు! విద్య, వైద్యం అందించలేని దుస్థితిలో ఈ పాలకులు ఉన్నారు. గర్భిణులు, ఆడపిల్లలకి అవసరమైన వైద్యం ఇవ్వలేకపోతున్నారు. మన ఇంటి ఆడబిడ్డలకి తగిన విద్య, సరైన వైద్యం, ఉపాధి అవకాశాలు అందించగలిగితే మంచి సమాజం ఏర్పడుతుంది.
స్త్రీని గౌరవించడం చాలా అవసరం. గిరిజనుల్ని కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు. జనసేన పార్టీ వారిని ఓట్లుగా చూడదు. వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు, గిరిజన గ్రామాలను అభివృద్ధి చేస్తాం. పాలకొండ ప్రాంతం, శ్రీకాకుళం జిల్లాను.. అవి ఓ మూలకు ఉన్నాయంటూ అభివృద్ధి చేయకుండా వదిలేశారు. కొన్ని కుటుంబాల చేతిలో ఈ జిల్లా చిక్కుకుపోయి వెనుకబాటుతనానికి గురైంది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరికీ సమాన గౌరవం ఇస్తుంది జనసేన పార్టీ. ప్రజల ఆశల్ని నెరవేర్చే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. జనసేన పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేశాక, ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ విధానం తప్పకుండా రద్దు చేస్తాం. అగ్రి గోల్డ్ బాధితులకి న్యాయం చేసేందుకు వామపక్షాలతో కలసి పోరాటం చేస్తాం’ అని పవన్ హామీ ఇచ్చారు.
జనక్షేత్రంలో... మీలో ఒకడిని
‘జనసేన సైనికులకి చెప్పేది ఒక్కటే... గ్రామాలకి వెళ్ళండి... రైతుల్ని, ఆడపడుచుల్ని, యువతని, సర్పంచ్ లనీ కలవండి. అక్కడి సమస్యలని గుర్తించండి. వాటిపై మనం అంతా కలిసి దృష్టిపెట్టి ఎలా పరిష్కారించాలో ఆలోచన చేద్దాం. జనం కష్టం, వారికి కలుగుతున్న నష్టాలు తెలుసుకొందాం. ఏసీ గదుల్లో కూర్చొనే రాజకీయాలు వద్దు. యువత అంతా ఓట్లు నమోదు చేసుకోండి. మీ తల్లిదండ్రుల్ని ‘జనసేన’కు ఓటు వేసేలా మోటివేట్ చేయండి. నేను పదవుల కోసమే వస్తే గత ఎన్నికల్లోనే పదవి తీసుకొనేవాడిని. ప్రజల సమస్యలు అవగాహన చేసుకొని... మీలో ఒకడిగా... ప్రజల భాగస్వామ్యంతో పాలన ఇస్తాను. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదు అని చెబుదాం. మన పార్టీ అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఉద్యోగాలు కల్పిద్దాం. ఈ ప్రాంత వెనుకబాటుతనానికి కారణమైన ప్రతి ఎమ్మెల్యేని, ఎంపీని ధైర్యంగా నిలదీయండి. భయపడొద్దు. మన పార్టీని బలమైన సంకల్పంతో ముందుకు తీసుకువెళదాం’ అని పవన్ ధైర్యం చెప్పారు.