BJP: కర్ణాటకలో బీజేపీ బంద్ అట్టర్ ఫ్లాప్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు!
- రైతు రుణాలను మాఫీ చేయాలని బీజేపీ డిమాండ్
- సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు
- పట్టించుకోని రైతులు, ప్రజలు
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కుమారస్వామి మాట తప్పారని ఆరోపిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన కర్ణాటక బీజేపీ నేతలు ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నారు. వారిచ్చిన బంద్ పిలుపునకు ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి లేశమాత్రమైనా స్పందన లేకపోవడం బీజేపీ నేతలకు తలకొట్టేసినట్టు అయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రోజులు గడుస్తున్నా రుణమాఫీ చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. రూ.53 వేల కోట్ల విలువైన రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.
స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలంటూ రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బంద్ ప్రభావం కనిపించలేదు. స్కూళ్లు, కాలేజీలు, రవాణా వ్యవస్థలకు ఎక్కడా ఆటంకం కలగలేదు. బంద్ పిలుపులో రాజకీయ కోణం ఉందన్న కారణంతో చాలామంది రైతులు, కన్నడ సంస్థలు బంద్‌కు దూరంగా ఉన్నాయి. తామిచ్చిన బంద్ పిలుపు అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రతిపక్ష బీజేపీ నిరాశలో కూరుకుపోయింది.