USA: ఒంటరి అమ్మాయిని పోలీసులు ఇలా కొడతారా?... గంటల వ్యవధిలో 46 వేల షేర్లు తెచ్చుకున్న వీడియో!
- అమెరికాలోని న్యూజెర్సీలో ఘటన
- బీచ్ లో ఉన్న యువతిపై పోలీసుల దౌర్జన్యం
- సోషల్ మీడియాలో వైరల్
"నేను బీచ్ లో నిద్రిస్తుండగా మెలకువ వచ్చింది. జరుగుతున్నది చూసి నన్ను నేను నమ్మలేకున్నాను... నేనేమీ పోలీసులకు వ్యతిరేకం కాదు. నా కళ్ల ముందు జరిగిన ఘటనను నలుగురితో పంచుకుంటున్నానంతే" అంటూ లెక్సీ అనే యువతి పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా, ఈ వీడియోపై న్యూజెర్సీ పరిధిలోని వైల్డ్ వుడ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ వీడియోలో బీచ్ లో సేదదీరుతున్న ఓ మహిళను అదుపులోకి తీసుకోవాలన్న క్రమంలో మగ పోలీసులు, ఆమెపై దాడికి దిగి, తలపై బలంగా మోదుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఎమిలీ వెయిన్ మన్ అనే 20 సంవత్సరాల యువతి ఇందులో కనిపిస్తున్న బాధితురాలని, ఆమె ఫిలడెల్ఫియా ప్రాంతానికి చెందినదని తెలుస్తోంది.
ఆమె ప్రతిఘటిస్తుంటే, ఓ అధికారి కాళ్లను గట్టిగా పట్టుకోగా, మరో అధికారి తలపై కనీసం రెండు సార్లు కొడుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. తానేమీ తప్పు చేయలేదని ఆమె ఏడుస్తుండగా, చుట్టూ ఉన్నవారు "పోలీసులకు ఎదురు తిరగవద్దు... చెప్పినట్టు చెయ్యి" అని ఆమెకు సలహా ఇస్తుండటం కూడా వినిపిస్తోంది. ఈ ఘటనను వీడియో తీసిన లెక్సీ దీన్ని ట్విట్టర్ ఖాతాలో పెట్టగా, గంటల వ్యవధిలో 46 వేల షేర్లను తెచ్చుకుంది. పోలీసుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తగా, ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
కాగా, బీచ్ లో మద్యం సేవిస్తూ గడుపుతున్న మైనర్లను నిలువరించేందుకు వచ్చిన పోలీసులు ఆమెను అనుమానించారని 'ఎన్ జే డాట్ కామ్' వెల్లడించింది. పోలీసులకు ఆమె సహకరించలేదని, అందువల్లే పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించారని తెలిపింది. ఆపై బ్రీత్ అనలైజర్ పరీక్ష జరిపి, ఆమె మద్యం తాగలేదని తేల్చి విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఆమెపై పోలీసు మీద ఉమ్మి వేయడం, బహిరంగ నిరసన తెలపడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలను మోపి కేసును నమోదు చేసి, విచారిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆమెపై ఎటువంటి క్రిమినల్ కేసులూ లేవని వెల్లడించారు.