motkupalli: సీనియర్ నాయకుడు అయ్యుండి ఆ ఏడుపు ఏమిటి?: మోత్కుపల్లిపై మంత్రి జవహర్ విమర్శలు
- ఏడ్చే మగాడిని నమ్మరాదు
- ఎంత మంది మాదిగలకు మోత్కుపల్లి మేలు చేశారు?
- ఏపీలో రథయాత్ర చేయాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చింది?
తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులుపై ఏపీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఒక సీనియర్ నేత అయిన మోత్కుపల్లి ఏడవటం ఏమిటని ఎద్దేవా చేశారు. ఏడ్చే మగాడిని నమ్మరాదని అన్నారు. మాదిగ దొరగా పేరుగాంచిన మోత్కుపల్లి ఎంత మంది మాదిగలకు మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 112 కోట్లతో మాదిగల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఏపీలో రథయాత్ర చేస్తానంటూ మోత్కుపల్లి ప్రకటించడాన్ని జవహర్ తప్పుబట్టారు. ఏపీలో రథయాత్ర చేయాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిందని అన్నారు.
నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తనకు తీరని అన్యాయం చేశారని ఆయన వాపోయారు. రాజకీయాల నుంచి చంద్రబాబు తప్పుకోవాలని... ఎన్టీఆర్ వారసుడైన జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీని అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ చంద్రబాబు అణగదొక్కారని ఆయన ఆరోపించారు.