water: మంచినీళ్ల కోసం శ్మశానానికి వెళుతోన్న ప్రజలు.. సిమ్లా శివారులో నీటికి కటకట!
- సిమ్లా శివారులో ఘటన
- బిందెడు నీళ్లు దొరకడమే గగనంగా మారిన వైనం
- నీళ్ల కోసం ప్రజల నిరసనలు
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని కొన్ని ప్రాంతాల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగర శివారు ప్రాంతంలో ఉండే చలాంతి వాసులకు దాదాపు వారం రోజుల నుంచి బిందెడు నీళ్లు కూడా దొరకడం లేదు. దీంతో వారు చివరికి శ్మశాన వాటికలో ఉన్న చేతి పంపు నుంచి నీరు తెచ్చుకుని తాగుతున్నారు.
నీళ్లు లేక దాహంతో ప్రాణాలు కోల్పోవడం కన్నా శ్మశానాలు ఉండే చోటు నుంచి నీళ్లు తెచ్చుకోవడమే మంచిదని వారు మీడియాకు తమ బాధ చెప్పుకున్నారు. ఎండాకాలంలో నీళ్లు దొరకడం లేదని, తమ సమస్యను పరిష్కరించాలని ఆ గ్రామస్తులు రెండున్నర గంటల పాటు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.