krishnapatnam port: అభివృద్ధిలో దూసుకుపోతున్న కృష్ణపట్నం పోర్టు.. సెంట్రల్ ఇండియాకు గేట్వేగా కేపీసీటీ: అనిల్ కుమార్ యెండ్లూరి
- సెంట్రల్ ఇండియా వ్యాపార అభివృద్ధికి కీలకం కానున్న పోర్టు
- నాగ్‌పూర్ రైల్వే వల్ల వ్యాపార విస్తరణకు మార్గం సుగమం
- కంటైనర్ హ్యాండ్లింగ్‌లో 88 శాతం వృద్ది
కృష్ణపట్నం పోర్టు సెంట్రల్ ఇండియాకు గేట్‌వే కానుందని పోర్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ యెండ్లూరి ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం పోర్టు నుంచి నాగ్‌పూర్ ఇన్లాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ) కి ప్రత్యేక కంటైనర్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడుతూ సెంట్రల్ ఇండియా రాష్ట్రాల వ్యాపార అభివృద్ధికి పోర్టు గేట్ వేగా రూపుదిద్దుకుంటోందన్నారు. అంతర్జాతీయ కార్గో హబ్‌గా ఖ్యాతి గాంచిన నాగ్‌పూర్ రైల్వే వల్ల తెలంగాణ సహా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వ్యాపార విస్తరణకు మార్గం సుగమం అవుతుందన్నారు.
అలాగే, ఎగుమతి, దిగుమతుల ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం చైనా నుంచి నాగ్‌పూర్‌కు సరుకుల రవాణాకు దాదాపు 25 రోజులు పడుతోందని, అదే కృష్ణపట్నం ద్వారా 18 రోజులు పడుతోందన్నారు. యాంగాన్ నుంచి నాగ్‌పూర్‌కు 15 రోజులు పడుతుండగా, పోర్టు ద్వారా కేవలం వారం రోజుల్లోనే చేరుతోందన్నారు. నాగ్‌పూర్ నుంచి కేపీసీటీ (కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్)కి 55 గంటల్లోనే రైలు చేరుతుందని అనిల్ కుమార్ తెలిపారు.
కేపీసీటీ డైరెక్టర్ వినీత వెంకటేశ్ మాట్లాడుతూ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, తూర్పు, పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి, దిగుమతులకు పోర్టు హబ్‌గా మారనుందని పేర్కొన్నారు. 2017-18లో కంటైనర్ హ్యాండ్లింగ్‌లో పోర్టు 88 శాతం, కార్గో హ్యాండ్లింగ్‌లో 25 శాతం వృద్ది సాధించిందని అనిల్ యెండ్లూరి వివరించారు.