Prakash Raj: ప్రమాణ స్వీకారం చేసి వారమైంది.. ఇక పాలన ప్రారంభించండి: ప్రకాశ్ రాజ్
- ఆ పదవులేవో కేటాయించండి
- కేబినెట్‌ను ప్రకటించండి
- పాలన కోసం ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారం రోజులైందని, ఇక పాలనపై దృష్టి సారించాలని కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కోరారు. రోజులు గడుస్తున్నా ఇంకా పాలనపై దృష్టి సారించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన తాజాగా మాట్లాడుతూ.. మంత్రి పదవులను ఖరారు చేసి కేబినెట్‌ను ప్రకటించాలని సూచించారు. ప్రజలు వారి పాలనను చూడాలనుకుంటున్నారని, కాబట్టి త్వరగా ఆ పనేదో చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
రాజకీయాల గురించి ఇటీవల తరచుగా గొంతెత్తుతున్న ప్రకాశ్ రాజ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందిగా ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటమి తప్పదని తెగేసి చెప్పారు. అయితే, హంగ్ కారణంగా హైడ్రామా తలెత్తడంతో తొలుత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, బలనిరూపణలో విఫలమైన ఆయన రాజీనామా చేయడంతో, జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రి పదవుల కేటాయింపు విషయంలో ఇప్పటి వరకు ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, మంత్రివర్గం ఇంకా కొలువుదీరలేదు. నేడో, రేపో కేబినెట్ బెర్త్‌లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ ఈ ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారమైనా పాలన ప్రారంభం కాలేదని, దానిపై దృష్టి సారించాలని సూచించారు.