Pranab Mukherjee: ఆరెస్సెస్ సమావేశానికి వెళతారా? మీ నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది!: ప్రణబ్‌కు మాజీ మంత్రి సీకే జాఫర్ షరీఫ్ లేఖ
- కాంగ్రెస్ వ్యక్తిగా మీరలా చేస్తారనుకోలేదు
- మీ ఆకస్మిక నిర్ణయంతో ఆశ్చర్యపోయా
- బ్యాక్ గ్రౌండ్‌ను మర్చిపోయి ప్రవర్తించడం సరికాదు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తనను ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సీకే జాఫర్ షరీఫ్ అన్నారు. జీవితాంతం కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన అకస్మాత్తుగా ఆరెస్సెస్ వైపు చూడడం తనను ఒకింత షాక్‌కు గురిచేసిందన్నారు. ప్రణబ్ తన బ్యాక్‌గ్రౌండ్‌ను మర్చిపోయి ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. అకస్మాత్తుగా ఆయన బయటకు వెళ్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రణబ్ కు ఆయన లేఖ రాశారు.
ఆరెస్సెస్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ సంఘం చీఫ్ మోహన్ భగవత్ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీతో దగ్గరి సంబంధాలున్న ఆరెస్సెస్ సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నారన్న వార్త కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన ఆ సమావేశానికి ఎలా హాజరవుతారంటూ పార్టీ నేతలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్ షరీఫ్ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.