Aircel: ప్రస్తుతానికి చిదంబరంను అరెస్ట్ చేయవద్దు ... తాత్కాలిక ఊరటనిచ్చిన ఢిల్లీ కోర్టు
- ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో ఆరోపణలు
- జూన్ 5 వరకూ చర్యలు వద్దు
- ఆదేశించిన ఢిల్లీ సీబీఐ స్పెషల్ కోర్టు
- చిదంబరం తరపున వాదించిన కపిల్ సిబల్
ఎయిర్ సెల్, మాక్సిస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి ఢిల్లీలోని సీబీఐ స్పెషల్ కోర్టు స్వల్ప ఊరటను ఇచ్చింది. తదుపరి విచారణ జరిగే జూన్ 5 వరకూ ఆయనపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశాలు వెలువరించింది. అంతవరకూ ఆయన్ను అరెస్ట్ చేయవద్దని చెబుతూ, ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సూచించింది.
కాగా, ఈ కేసులో చిదంబరం తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ, తన క్లయింటుపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర దాగుందని అన్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి అధికారులు తహతహలాడుతున్నారని, తన క్లయింట్ హక్కుల పరిరక్షణ కోసం ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.
వాదనలు విన్న న్యాయమూర్తి, తాత్కాలిక ఊరటను ఇస్తూ తీర్పిచ్చారు. ఇదిలావుండగా, సుమారు 800 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా దేశంలోకి తీసుకు వచ్చారని, దీనికి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం అనుమతించారని అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ డీల్ తరువాత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి కోట్ల రూపాయల ముడుపులు అందాయని కేసు నమోదు చేసిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆయనకు చెందిన 1.16 కోట్ల ఆస్తిని కూడా అటాచ్ చేసింది.