Rajinikanth: తూత్తుకుడి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తాను: రజనీకాంత్
- ఆ ప్లాంట్ ఇక ఎప్పటికీ తెరచుకోవడానికి వీల్లేదు
- అసాంఘిక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి
- ఈ ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం లాంటిది
- అల్లర్లు జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేకపోయారు
తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసుల చేతిలో 13 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ రోజు మృతుల కుటుంబాలను సినీనటుడు రజనీకాంత్ పరామర్శించారు. వారికి రూ.2 లక్షల చొప్పున తాను పరిహారం ఇస్తానని ప్రకటించారు. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ యజమానులు కూడా అమానవీయంగా ప్రవర్తించారని, ఆ ప్లాంట్ ఇక ఎప్పటికీ తెరచుకోవడానికి వీల్లేదని అన్నారు.
ఈ ఆందోళనల్లో ప్రవేశించి విధ్వంసానికి కారణమైన అసాంఘిక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం లాంటిదని, ఇంతటి అల్లర్లు జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేకపోయారని అన్నారు. తూత్తుకుడిలో జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలుసని, వారికి సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు.
ఈ సమస్యను కొందరు రాజకీయం చేస్తున్నారని, అన్ని సమస్యలకు రాజీనామాలు చేయాలని మంత్రుల ముందు డిమాండ్ ఉంచడం పరిష్కారం కాదని రజనీకాంత్ అన్నారు. తూత్తుకుడి ఘటనలో నిఘా వర్గాల వైఫల్యం ఉందని, అలాగే ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్‌పై తనకు నమ్మకం లేదని చెప్పారు.