tet: ఏపీ టెట్ సెంటర్ల ఆప్షన్ల నమోదు గడువు నేటి అర్ధరాత్రితో పూర్తి
- టెట్ సెంటర్లు 81 నుంచి 109కి పెంపు
- సబ్జెక్టు, మీడియం, పేపర్ మార్పునకు 4276 ఫిర్యాదులు
- అన్ని ఫిర్యాదులు పరిష్కారం
- సెంటర్ల మార్పునకు అవకాశం లేదు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసే అభ్యర్థుల సౌకర్యార్థం టెట్ జిల్లా పరీక్షా కేంద్రాలను 81 నుంచి 109 కి పెంచినట్లు టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఆప్షన్ల గడువు నేటితో ముగుస్తోందని, మొత్తం 3,97,957 అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేశారని, ఈ రోజు సాయంత్రం 5.గం.ల సమయానికి 3,82, 576 అభ్యర్థులు సెంటర్ల ఆప్షన్లను నమోదు చేశారని అన్నారు. అంటే 96.13 శాతం మంది ఆప్షన్లను నమోదు చేశారని తెలిపారు.
ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. సబ్జెక్టు, మీడియం, పేపర్ మార్పునకు సంబంధించి 4276 ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరించామన్నారు. పరిష్కరించిన వారికి ఇప్పటికే సంక్షిప్త సందేశాలు అందించామని, వీరు కూడా జిల్లా పరీక్షా కేంద్రాల ఆప్షన్లను అర్ధరాత్రి 12 లోగా పెట్టుకోవాలని సూచించారు. అభ్యర్థులు సూచించిన ఆప్షన్ల ప్రకారమే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో జిల్లా పరీక్షా కేంద్రాలను కేటాయించామన్నారు.
జిల్లాల సీటింగ్ సామర్థ్యం ఆధారంగా అభ్యర్థుల ఆప్షన్ల ప్రకారం సెంటర్ల ఎంపిక జరిగిందని, సెంటర్ల మార్పునకు అవకాశం లేదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల ఎంపికకు సంబంధించి మే 24 నుంచి 29 వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి అభ్యర్థుల మొబైళ్లకు సంక్షిప్త సమాచారం అందించామన్నారు.