Guntur: కళ్లు చెదిరే ఆస్తులు కూడబెట్టిన బిల్ కలెక్టర్.. ఏసీబీకి చిక్కిన మరో లంచగొండి!
- గుంటూరులో అవినీతి బిల్ కలెక్టర్
- ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ
- కోట్లాది రూపాయల ఆస్తుల గుర్తింపు
చేసేది బిల్ కలెక్టర్ ఉద్యోగం. కోట్లలో ఆస్తులు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కిన గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ బిల్ కలెక్టర్ ముద్రబోయిన మాధవ్ ఆస్తులు చూసిన అధికారులకు మతి పోయినంతపనైంది. అందినకాడికి దోచుకుని అడ్డదిడ్డంగా ఆస్తులు సంపాదించుకున్నాడు. బుధవారం మాధవ్‌తోపాటు ఆయన బంధువులు, బినామీలకు చెందిన తొమ్మిది ప్రాంతాల్లో ఏక కాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. గుంటూరు, పొన్నూరు, మాచవరంలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.
గంటూరులోని మాధవ్ ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఆయన, ఆయన భార్య రేఖ పేరుతో నాలుగు అపార్ట్మెంట్లలో ప్లాట్లు, నాలుగు ఇళ్లు, 20 స్థలాలు, ఇన్నోవా వాహనం, మూడు ద్విచక్ర వాహనాలు, రూ. ఏడు లక్షల నగదు, 200 గ్రాముల బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. సాధారణ బిల్ కలెక్టర్ ఆస్తుల గురించి తెలిసిన గుంటూరు నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు.