India: రెండు రోజుల బ్యాంకుల సమ్మెతో జరిగిన నష్టం ఎంత?
- సమ్మెలో పాల్గొన్న 10 లక్షల మంది
- ఆగిన 80 లక్షల చెక్కు క్లియరెన్స్
- రూ. 20 వేల కోట్ల విలువైన లావాదేవీలపై ప్రభావం
వేతనాల పెంపు కోసం ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె ముగిసి, నేటి నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనగా, బ్యాంకింగ్ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ రెండు రోజుల వ్యవధిలో సుమారు 80 లక్షల చెక్కుల క్లియరెన్స్ ఆగిపోయింది.
సమ్మె వల్ల సుమారు రూ. 20 వేల కోట్ల విలువైన లావాదేవీలపై ప్రభావం పడిందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అసోచామ్ (భారత పరిశ్రమలు, వాణిజ్య సమాఖ్య) అంచనాల మేరకు పెండింగ్ లో పడిన 80 లక్షల చెక్కుల క్లియరెన్స్ కు కనీసం వారం రోజుల సమయం పడుతుంది. రోజువారీ వచ్చే చెక్కులతో పాటు, అదనంగా రోజుకు 10 లక్షల చెక్కుల వరకూ క్లియర్ అవుతాయని అసోచామ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.