Vijayawada: విజయవాడలో నవ నిర్మాణ దీక్ష: ప్రజలతో చంద్రబాబు చేయించిన ప్రతిజ్ఞ పూర్తి పాఠం!
- పాల్గొన్న చంద్రబాబు, మంత్రులు
- ఉత్సాహంగా తరలివచ్చిన ప్రజలు
ఈ ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ లో జరిగిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
"అవినీతి, అశాస్త్రీయ విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలతో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని సంఘటితంగా ప్రతిఘటించడానికి సమాయత్తంగా ఉంటాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు, నాటి ప్రధాని హామీలు అమలయ్యే వరకూ ధర్మపోరాటాన్ని కొనసాగిస్తాము.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలుపెరగని శ్రమజీవులం మనం. ప్రతి సంక్షోభాన్నీ ఒక అవకాశంగా మలచుకుందాం. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమ శిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనమందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాము.
అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్షను ఈ క్షణంలో మనమందరం చేపడుతున్నాం. జై హింద్... జై ఆంధ్రప్రదేశ్... జైజై ఆంధ్రప్రదేశ్" అని ప్రతిజ్ఞ చేయించారు.