Petrol: 'పెట్రోల్... పెట్రోల్' అనడం మాని వేరే దారి చూసుకోండి: నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
- పెట్రోలు, డీజెల్ ధరలు ఆకాశానికి
- ప్రత్యామ్నాయ ఇంధనాలను చూసుకోండి
- బయో-డీజిల్, బయో-పీఎన్జీ, విద్యుత్ వాహనాలు అందుబాటులో
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు ఆకాశానికి ఎగసిన వేళ, వాహనదారులు తీవ్ర నిరసనలను తెలియజేస్తుండగా, ఈ సమస్యపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోలు ధరలపై ప్రత్యామ్నాయ ఇంధనాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పిన ఆయన, ప్రజలు పెట్రోల్ పెట్రోల్ అని గగ్గోలు పెట్టకుండా వేరే దారి చూసుకోవాలని, ప్రత్యామ్నాయ రవాణా సాధనాలను, ఇందనాన్ని వాడటాన్ని అలవాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
పూణెలో మీడియాతో మాట్లాడిన ఆయన, ధరలు మెల్లిగా దిగివస్తున్నాయన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తిరిగి ఎప్పుడైనా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇంధన ధరల విషయం దీర్ఘకాల సమస్యని, దీనికి పరిష్కారాన్ని వెతికే పనిలో తమ ప్రభుత్వం ఉందని చెప్పిన ఆయన, 'పెట్రో' ఉత్పత్తులను తిరిగి సబ్సిడీ పరిధిలోకి తీసుకువస్తే, సంక్షేమ పథకాలకు నిధులు తగ్గుతాయని అన్నారు. పెట్రోల్, డీజెల్ పై సబ్సిడీని నిలపగా ఆదా చేసిన డబ్బుతో 8 కోట్ల మంది పేదలకు ఎల్పీజీ కనెక్షన్లను అందించామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఇంధనాలుగా ఇథనాల్, బయో-డీజిల్, బయో-పీఎన్జీ, విద్యుత్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.