subrahmanian swamy: మనల్ని శిక్షించడానికే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు: సుబ్రహ్మణ్యస్వామి
- పార్టీలోని ప్రముఖ నేతలను ముందుకు తీసుకురావాలి
- ఉప ఎన్నికల్లో కులం ఆధారంగా ఓటు వేశారు
- మహా కూటమి ఏర్పడితే పాక్, చైనాలు మనపై ఆధిపత్యం చలాయిస్తాయి
ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మేలుకొలుపని ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఈ ఫలితాలతో పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాశ చెందవద్దని చెప్పారు. పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని, పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గౌరవించాలని తెలిపారు. ఉప ఎన్నికలో కులం ఆధారంగా ఓటు వేశారని చెప్పారు.
బీజేపీని ఓడించడానికే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. కానీ, రాబోయే సాధారణ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని ఓటు వేస్తారని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడితే... పాకిస్థాన్, చైనాలు మనపై ఆధిపత్యం చలాయిస్తాయని అన్నారు. ఎందుకంటే మహాకూటమిలో పాకిస్థాన్ కు మద్దతు ఇచ్చే కాంగ్రెస్, చైనాకు అనుకూలంగా ఉండే కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయని చెప్పారు.