Saudi Arabia: రష్యా క్షిపణులను కొంటే మీకు మూడినట్టే: ఖతర్‌ను హెచ్చరించిన సౌదీ అరేబియా
- గతేడాది ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్న సౌదీ
- రష్యా క్షిపణుల కోసం ఖతర్ చర్చలు
- ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ
రష్యా క్షిపణులను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ఖతర్‌కు సౌదీ అరేబియా హెచ్చరికలు జారీ చేసింది. అదే కనుక జరిగితే సైనిక చర్య తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు లేఖ రాసిన సౌదీ రాజు సల్మాన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. సౌదీ లేఖకు ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.
ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందన్న ఆరోపణలతో గతేడాది జూన్‌లో సౌదీ అరేబియా సహా బెహ్రయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. అంతేకాదు, ఆ దేశంపై ఆంక్షలు కూడా విధించాయి. దీంతో ఒంటరిగా మారిన ఖతర్.. రష్యా వంటి కొత్త స్నేహితులకు దగ్గరైంది. ఈ జనవరిలో రష్యా నుంచి ఎస్-400 డిఫెన్స్ మిసైల్ సిస్టంను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపింది. దీంతో మండిపడిన సౌదీ ఆ డీల్‌ను కనుక కుదుర్చుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, సైనిక చర్య తప్పదని హెచ్చరించింది.