Tirumala: తిరుమలలో ఏ మాత్రమూ తగ్గని రద్దీ... నేడు క్యూలైన్ లోకి వెళితే రేపే స్వామి దర్శనం!
- స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్న 60 వేల మంది
- దర్శనానికి 22 గంటల సమయం
- కాలినడక భక్తులకు 5 గంటల సమయం
ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చి, తెలంగాణలో పాఠశాలలు ప్రారంభమైనా తిరుమలలో మాత్రం భక్తుల రద్దీ తగ్గలేదు. దాదాపు 60 వేల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఈ ఉదయం సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లే భక్తులకు 22 గంటల తరువాత దర్శనం కల్పిస్తామని టీడీపీ అధికారులు తెలిపారు.
టైమ్ స్లాట్ టోకెన్ తీసుకోవాలని భావిస్తే, రేపు ఉదయం 8 గంటల సమయంలో క్యూ లైన్ లోకి రావాలని సూచిస్తూ, సమయాన్ని కేటాయిస్తున్నారు. కాలినడక భక్తులకు 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో ఉన్న వారికి అన్న పానీయాలకు లోటు రాకుండా చూస్తున్నామని తెలిపిన అధికారులు, ఈ రద్దీ మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. కాగా, శనివారం నాడు స్వామివారిని 95 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.