goa bjp womens chief: బీచ్ లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: గోవా బీజేపీ మహిళా చీఫ్
- అనుచిత ఘటనలు జరగకుండా నివారణోపాయం సూచించిన సులక్షణ సావంత్
- ప్రతీ ఒక్కరికీ రక్షణను ప్రభుత్వం కల్పించలేదు
- ప్రజలే తోటి వారికి రక్షణ ఇవ్వగలరని అభిప్రాయాలు
ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించలేదని గోవా బీజేపీ మహిళా విభాగం చీఫ్ సులక్షణ సావంత్ అన్నారు. అత్యాచార ఘటనలు పెరిగిపోతుండడంపై ఆమె స్పందిస్తూ ఆ విధంగా అభిప్రాయపడ్డారు. గత నెల 25న గోవాలోని బెటల్ బాటిమ్ బీచ్ లో 25 ఏళ్ల యువతిపై ముగ్గురు పర్యాటకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే.
‘‘ప్రజల మనస్తత్వాన్ని మార్చాలి. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించలేం. కానీ, ప్రజలే ఇతరుల పాలిట రక్షణ కవచంగా వ్యవహరించగలరు’’ అని ఓ ఉచిత సలహా పడేశారు. ఎక్కువ మంది ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నందునే ఎక్కువ అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయని సులక్షణ సావంత్ పేర్కొన్నారు. మారుమూల బీచ్ లలో అనుచిత ఘటనలు జరగకుండా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోవాకు ఏటా 70 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇందులో 5 లక్షల మంది వరకు విదేశీయులే.