bhim app: భీమ్ యాప్ ను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లండి... అన్ని శాఖలకు ప్రధాని డైరెక్షన్
- ఏప్రిల్ లో భీమ్ యాప్ ద్వారా తగ్గిన లావాదేవీలు
- 9.5 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గుదల
- దీంతో వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశం
ప్రధాని మరోసారి డిజిటల్ లావాదేవీలపై స్పందించారు. డిజిటల్ లావాదేవీలను పెంచే విషయంలో అన్ని ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయన లక్ష్యాలను నిర్దేశించారు. ప్రభుత్వ యాప్ అయిన భీమ్ (భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ) ద్వారా ఆగస్ట్ 15 నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భీమ్ యాప్ ద్వారా జరిగిన లావాదేవీలు 9.5 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో భీమ్ ద్వారా లావాదేవీలు 6.3 శాతానికే పరిమితం అయ్యాయి.
2016 నవంబర్ లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత సులభంగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకునేందుకు అదే ఏడాది డిసెంబర్ 30న ప్రధాని భీమ్ యాప్ ను ఆవిష్కరించారు. అప్పటి నుంచి భీమ్ యాప్ ద్వారా లావాదేవీలు పెరుగుతూ రాగా, ఈ ఏడాది ఏప్రిల్ లో తగ్గడం గమనార్హం. ఏప్రిల్ లో భీమ్ ద్వారా సుమారు రూ.4,973 కోట్ల విలువైన 1.26 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ప్రధాని మరోసారి ప్రభుత్వ విభాగాలకు లక్ష్యనిర్దేశనం చేశారు. ముఖ్యంగా ఎక్కువ నగదు లావాదేవీలు జరిగే రైల్వే, ఆహార, పౌరసరఫరాల విభాగాన్ని భీమ్ యాప్ వినియోగాన్ని పెంచాలని కోరారు. భీమ్-యూపీఐ చెల్లింపులపై బ్యాంకు చార్జీల సమస్య పరిష్కారాన్ని చూడాలని కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హాను ప్రధాని ఆదేశించారు.