Kamal Haasan: కుమారస్వామి స్పందనతో ధైర్యం కలుగుతోంది: కమలహాసన్
- కుమారస్వామితో ముగిసిన కమల్ భేటీ
- ఆరోగ్యకరమైన చర్చ జరిగిందన్న కమల్
- రజని వ్యాఖ్యలతో విభేదిస్తున్నా
కావేరి నదీ జలాల సమస్యపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ చర్చించారు. బెంగుళూరులో వీరిద్దరి మధ్య చర్చ దాదాపు గంటసేపు కొనసాగింది. అనంతరం మీడియాతో కమల్ మాట్లాడుతూ, తమ మధ్య ఆరోగ్యకరమైన చర్చ నడిచిందని చెప్పారు. కుమారస్వామి స్పందన ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉందని అన్నారు.
కోర్టు వెలుపల ఈ సమస్యను పరిష్కరించుకునే వీలుందా? అనే ప్రశ్నకు బదులుగా... ఇరు రాష్ట్రాలు కావేరి జలాలను పంచుకుంటున్నాయని, ఈ సమస్య తీరేందుకు రెండు వేర్వేరు మార్గాలు (కోర్టు, కోర్టు వెలుపల) ఉండవని చెప్పారు. కుమారస్వామి కూడా ఈ అంశాన్ని ఇదే కోణంలో చూస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు.
తమిళనాడు తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ను మూసివేయాలని జరిగిన నిరసనలు, పోయిన ప్రాణాలను ప్రస్తావిస్తూ, సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్లెక్కితే, తమిళనాడు శ్మశానంలా మారుతుందంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... 'రజనీతో నేను విభేదిస్తున్నా. నేను గాంధేయవాదిని. హింసాత్మక పోరాటాలకు నేను వ్యతిరేకం' అని తెలిపారు.