Missing: రెండేళ్ల క్రితం కిడ్నాప్ అయిన బాలుడు.. చెక్కపెట్టెలో అస్థిపంజరంగా కనపడ్డాడు!
- ఢిల్లీలోని సహీబాబాద్లో ఘటన
- పెట్టెలోని దుస్తులను పరిశీలించిన బాలుడి తండ్రి
- తన కుమారుడిదేనని గుర్తింపు
దేశ రాజధాని ఢిల్లీలోని సహీబాబాద్ ప్రాంతంలోని ఓ ఇంటి డాబాపై ఓ చెక్కపెట్టలో చిన్నారి అస్థిపంజరం బయటపడింది. ఈ విషయాన్ని మొదట గుర్తించిన పలువురు చిన్నారులు స్థానికులకు తెలిపారు. అస్థిపంజరాన్ని పరిశీలించగా అది సుమారు రెండేళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ బాలుడిదని అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. 2016 డిసెంబరు ఒకటిన మహమ్మద్ జైద్ అనే బాలుడిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి, అతడి తండ్రికి ఫోన్ చేసి రూ.8 లక్షలు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఆందోళన చెందిన ఆ బాలుడి తండ్రి పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. అయితే, ఆ బాలుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. నిన్న కొందరు పిల్లలు ఆడుకుంటూ గరిమా గార్డెన్ ప్రాంతంలో ఓ డాబాపైకి వెళ్లగా ఆ చిన్నారి అస్థిపంజరం చెక్కపెట్టలో లభించింది. ఆ పెట్టెలోని దుస్తులను పరిశీలించిన జైద్ తండ్రి... అది తన కుమారుడి అస్థిపంజరమేనని గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోస్టు మార్టం, డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఆ అస్థిపంజరాన్ని ఆసుపత్రికి తరలించారు.