Steve Smith: నిజం చెబుతున్నా.. నాలుగు రోజులు ఏడుపు ఆపలేదు: స్మిత్
- బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఏడాది నిషేధం
- మానసికంగా కుంగిపోయానన్న స్మిత్
- నేడు ఇలా ఉండడానికి కుటుంబ సభ్యులే కారణమన్న ఆసీస్ క్రికెటర్
బాల్ ట్యాంపరింగ్ తర్వాత నాలుగు రోజులపాటు ఏకధాటిగా ఏడుస్తూనే ఉన్నానని ఆసీస్ మాజీ కెప్టెన్ స్మిత్ తెలిపాడు. సిడ్నీలోని ఓ పాఠశాలను సందర్శించిన స్మిత్ మాట్లాడుతూ బాల్ ట్యాంపరింగ్‌లో చిక్కుకుని స్వదేశం చేరుకున్నాక నాలుగు రోజులపాటు ఏడుస్తూనే ఉన్నానని, ఇది నిజమని పేర్కొన్నాడు. ఆ సమయంలో మానసికంగా కుంగిపోయానని, కళ్లన్నీ బరువుతో నిండిపోయాయన్నాడు.
అయితే, కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా ఉండి చూసుకోవడం తన అదృష్టమని పేర్కొన్నాడు. తనను ఒంటరిగా విడిచిపెట్టకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ తన బాధను దూరం చేసేందుకు ప్రయత్నించారని వివరించాడు. వారు ఆ రోజు అలా చూసుకున్నారు కాబట్టే తాను ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నానని అన్నాడు.
కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో స్మిత్, వార్నర్‌ల పాత్ర కూడా ఉందని తేలడంతో వారిద్దరిపై ఏడాది, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం వేటు పడింది. ఫలితంగా స్మిత్, వార్నర్ ఐపీఎల్‌కు దూరమయ్యారు.