amit shah: ఉప ఎన్నికల ఓటమి తర్వాత అమిత్ షాను కలసిన యోగి!
- ఎయిమ్స్‌లో ఉన్న యూపీ డిప్యూటీ సీఎంను పరామర్శించిన యోగి
- పార్టీ పటిష్టతపై అమిత్ షాతో చర్చ
- ఉప ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషణ
ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థుల ఓటమిపై చర్చించినట్టు సమాచారం. కైరానా, నూర్పూర్ స్థానాల్లో బీజేపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. ముఖ్యమంత్రి యోగి పాలనాతీరుపై సహచర మంత్రి, మిత్ర పక్షానికి చెందిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చేసిన విమర్శలు, ప్రతిపక్షాలు ఏకమైన తీరును కూడా వీరు చర్చించినట్టు సమాచారం.
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆపరేషన్ చేయించుకున్న యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి యోగి ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా పనిలో పనిగా అమిత్ షాను కూడా కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. కైరానా లోక్‌సభ, నూర్పూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అంచనాలను అందుకోలేకపోవడం వెనక ఉన్న కారణాలపై ఇద్దరు నేతలు కూలంకషంగా చర్చించినట్టు పార్టీ నేతలు తెలిపారు. అలాగే పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.