indian railway: సైజు తగ్గినా ఫర్వాలేదు... ఆహారంలో నాణ్యత ఉంటే చాలు... రైల్వే కొత్త యోచన
- 150 గ్రాముల బరువు తగ్గిపోనున్న భోజనం
- మెనూ నుంచి కొన్ని తొలగింపు
- ముందుగా ప్రీమియం రైళ్లలో నాణ్యతతో కూడిన ఆహారం
నాసిరకం ఆహారంపై ప్రయాణికుల నుంచి అదే పనిగా ఫిర్యాదులు వస్తుండడంతో రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. ఆహార పదార్థాల సైజు తగ్గించి నాణ్యంగా అందించాలనుకుంటోంది. నాణ్యతలేమి ఆహార సరఫరాను నియంత్రించాలని నిర్ణయించింది. ముందుగా ప్రీమియం రైళ్లయిన శతాబ్ది, రాజధానిలో నాణ్యమైన ఆహారం అందించే చర్యలు తీసుకోనుంది.
దీంతో భోజనం కాస్తా 150 గ్రాముల మేర బరువు తగ్గిపోనుంది. మెనూలో భాగంగా అందిస్తున్న కొన్నింటిని తొలగించనున్నారు. సూప్, బ్రెడ్ స్టిక్స్, బటర్, శాండ్ విచ్ లను మెనూ నుంచి ఐఆర్ సీటీసీ తొలగించనుంది. రైస్, రోటీ కాంబినేషన్ తో మీల్స్ అందించనుంది. నాణ్యమైన ఆహారం అందించేందుకు ఎన్నో సమస్యలు ఉన్నాయని రైల్వే శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు అంగీకరించారు. అయితే, పరిమాణం తగ్గించడం ద్వారా నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.