Telugudesam: కేంద్రం, టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డ వామపక్ష నేతలు!
- కేంద్రమే కాదు టీడీపీ ప్రభుత్వమూ రాష్ట్రానికి అన్యాయం చేసింది
- నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు: సీపీఎం మధు
- మోదీ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తాం
- సెప్టెంబర్, అక్టోబర్ లలో జాతీయ యాత్రలు చేపడతాం: సురవరం
ఏపీలో టీడీపీ ప్రభుత్వం మితిమీరిన అహంకారం ప్రదర్శిస్తోందని సీపీఎం నేత మధు విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో, టీడీపీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అంత అన్యాయం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేపట్టిన నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాదని విమర్శించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వం తీరుపై సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశాన్ని నష్టపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా ఆగస్టు 1వ తేదీ నుంచి వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ సెప్టెంబర్, అక్టోబర్ లలో జాతీయ యాత్రలు చేపడతామని, అక్టోబర్ లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు.