YSRCP: సీబీఐ విచారణను తప్పుదోవపట్టించేందుకు టీడీపీ యత్నిస్తోంది!: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- ఎయిర్ ఏషియా స్కామ్ లో చంద్రబాబు పేరు బయటకొచ్చింది
- అందుకే, సీబీఐ విచారణను తప్పుదోవపట్టిస్తున్నారు
- మా ఎంపీల రాజీనామాలు కచ్చితంగా ఆమోదం పొందుతాయి
ఎయిర్ ఏషియా స్కామ్ లో చంద్రబాబు పేరు రావడంతో, దీనిపై జరుగుతున్న సీబీఐ విచారణను తప్పుదోవపట్టించేందుకు టీడీపీ యత్నిస్తోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు చిత్తశుద్ధితో రాజీనామాలు చేసి, ఆ లేఖలను స్పీకర్ కు అందజేశామని చెప్పారు. నిన్నో, మొన్నో తాము రాజీనామాలు చేసినట్టుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, వారి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ రాజీనామాలు కచ్చితంగా ఆమోదం పొందుతాయని, హోదా కోసం వైసీపీ చిత్తశుద్ధితో పోరాడుతోందని చెప్పారు.
అవిశ్వాసం పెడతాం, మద్దతు ఇమ్మని ఆ రోజు టీడీపీని కోరితే.. ఇస్తామని చెప్పిన చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాతో మేలు జరుగుతుందని ఆరోజున తాము ఎంత చెప్పినా టీడీపీ వినలేదని, హోదా కోసం టీడీపీతో కలిసి పనిచేస్తామని కూడా నాడు చెప్పామని అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయమంటే పారిపోయింది టీడీపీయేనని, 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి వుంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదని, నాలుగేళ్లలో ఏపీకీ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పై ఆయన ఆరోపణలు చేశారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ లోకేషేనని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికింది తన తండ్రి చంద్రబాబే అనే విషయాన్ని లోకేష్ గుర్తుంచుకోవాలని అన్నారు.