Karnataka: కర్ణాటకలో 'కాలా' విడుదల చేయడం మంచిది కాదు: షాకిచ్చిన సీఎం కుమారస్వామి
- భద్రత కల్పించాలని హైకోర్టు సూచన
- స్పందించిన కర్ణాటక సీఎం
- సీఎంగా తనకు బాధ్యత ఉందన్న కుమారస్వామి
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా' సినిమా విడుదలకు కర్ణాటకలో అడ్డంకులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఓ ముఖ్యమంత్రిగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కాలా సినిమా విడుదల మంచిది కాదని అన్నారు. ఓ సీఎంగా కాకుండా, సాధారణ పౌరుడిగా, కన్నడ వ్యక్తిగా మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు.
కాగా, కర్ణాటకలో 'కాలా' విడుదలపై డిస్ట్రిబ్యూటర్లు నిషేధం విధించిన నేపథ్యంలో ఆ సినిమా బృందం ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. ఈరోజు వారి పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు 'కాలా' సినిమా నిషేధంపై తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ, ఈ సినిమా ప్రదర్శనకు భద్రత కల్పించాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.