Kumaraswamy: చంద్రబాబు, కేసీఆర్ సలహాతోనే కాంగ్రెస్‌తో పొత్తు: కుమారస్వామి
- వారు చెప్పారు కనుకే కాంగ్రెస్‌తో జట్టు
- నాన్న ఇమేజీని కాపాడాలని నిర్ణయించుకున్నా
- కాంగ్రెస్ వల్ల మాకొచ్చే ముప్పేమీ లేదు
కాంగ్రెస్‌తో జేడీఎస్ పొత్తు పెట్టుకోవడం వెనక ఎవరున్నదీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచనలతోనే తాను కాంగ్రెస్‌తో జట్టు కట్టినట్టు వివరించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అదే చెప్పారని, బీజేపీ కంటే కాంగ్రెస్ చాలా బెటరన్న సూచనలతోనే కాంగ్రెస్‌తో వెళ్లినట్టు ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
బీజేపీతో కలవడం తండ్రి దేవెగౌడకు ఇష్టం లేదన్నారు. ఇన్నేళ్లుగా ఆయన సంపాదించుకున్న సెక్యులర్ ఇమేజ్ తన వల్ల దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. 1997లో వాజ్‌పేయి కోరినప్పుడు తన తండ్రి మద్దతు ఇవ్వలేదని అన్నారు. '2006లో నేను బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మా నాన్నకు ఇష్టం లేదు. నా వల్ల మా నాన్న ఆరోగ్యం క్షీణించింది. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దాలనుకున్నా'నని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసినంత మాత్రాన జేడీఎస్‌కు వచ్చిన ముప్పేమీ లేదని కుమారస్వామి తేల్చి చెప్పారు.