kodi ramakrishna: బిక్షమెత్తుకునే అయిదేళ్ల అమ్మాయిని చూసి ఆయన చలించిపోయాడు : కోడి రామకృష్ణ
- ఓ అయిదేళ్ల అమ్మాయి నడిరోడ్డుపై వుంది
- మండుటెండలో బిక్షమెత్తుతోంది
- కాళ్లకి చెప్పులు కూడా లేవు
తెలుగు తెరపై విభిన్నమైన కథలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా ఆయనకి మంచి పేరు వుంది. అలాంటి కోడి రామకృష్ణ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు.
"దేవుడిని నేను నమ్ముతాను .. ఆయన రాతిబొమ్మలో కాదు .. ఇతరులకు చేసే సేవలో ఉంటాడని నమ్ముతాను. మానవ సేవయే మాధవసేవ అని పూర్తిగా విశ్వసిస్తాను. 'అమ్మోరు ' సినిమా సమయంలో నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే, ఆ సినిమాకి గ్రాఫిక్స్ చేస్తోన్న 'క్రిష్' అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చూసి .. విషయమేమిటని అడిగాము.
"నేను కారులో వస్తుంటే .. ఒక అయిదేళ్ల అమ్మాయి మండుటెండలో రోడ్డుపై బిక్షమెత్తుకుంటూ కనిపించింది . . కాళ్లకి చెప్పులు కూడా లేవు .. ఆ అమ్మాయికి అన్నం పెట్టాలని వుంది .. " అంటూ ఏడుస్తున్నాడు. దాంతో ఆయన్ని వెంటబెట్టుకుని కారులో బయలుదేరి వెళ్లాము .. చాలా చోట్ల వెతికి ఒక చోట ఆ అమ్మాయిని పట్టుకున్నాం. ఆ అమ్మాయిని చూడగానే క్రిష్ ఆనందపడిపోయి .. ఎత్తుకున్నాడు. మంచి భోజనం పెట్టించి డబ్బులు ఇచ్చాడు .. చెప్పులు కూడా కొనిచ్చి అప్పుడు కళ్లు తుడుచుకున్నాడు. మానవత్వమంటే అదీ అనిపించింది నాకు " అంటూ చెప్పుకొచ్చారు.