cuddapah: నీట్ లో పాసైన ‘ఫాతిమా’ విద్యార్థులకు ఇక్కడే ప్రవేశం కల్పిస్తాం: సీఎం చంద్రబాబు
- నీట్ లో మనవాళ్లు వందకు డెబ్బైమూడు మంది పాసయ్యారు
- నీట్ రాయని ‘ఫాతిమా’ విద్యార్థులకు డబ్బు వెనక్కి ఇప్పిస్తాం
- విద్యకు పెద్దపీట వేస్తాం.. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
నీట్ లో పాసైన ఫాతిమా కళాశాల విద్యార్థులకు ఇక్కడే ప్రవేశం కల్పిస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నవ నిర్మాణ దీక్ష ఐదో రోజులో భాగంగా ఈరోజు కడపలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నీట్ లో మనవాళ్లు వందకు డెబ్బైమూడు మంది పాసయ్యారని చంద్రబాబు ప్రసంసించారు. నీట్ రాయని ఫాతిమా కళాశాల విద్యార్థులకు వారి డబ్బులు వెన్నక్కి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
విద్యకు పెద్దపీట వేస్తామని, పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు మక్కీ కొట్టకుండా, విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. విద్యార్థుల కోసం డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు.విద్యార్థుల జీవితాల్లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భాగం కావాలని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో అదనంగా 50 జూనియర్ కళాశాలలు, 15 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అదే విధంగా పారిశ్రామికాభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి సారించిందని, పలు కంపెనీలతో 2,844 ఎంవోయులు కుదుర్చుకున్నామని, అవి పూర్తయితే రాష్ట్రానికి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 37 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.