kanna: కన్నా ఫోన్ ను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోంది: జీవీఎల్ ఆరోపణ
- ఏపీలో పలువురు రాజకీయ నేతల ఫోన్లనూ ట్యాప్ చేస్తోంది
- టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు
- ఎయిర్ ఏషియా అవినీతి వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫోన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం కన్నా ఫోన్ నే కాకుండా, ఏపీలో అనేక మంది రాజకీయ నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించారు. టీడీపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎయిర్ ఏషియా అవినీతికి పాల్పడిందని ఆరోపణలు తలెత్తాయని, దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని అన్నారు.
కాగా, ఈ ఆరోపణలపై ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు. కన్నా ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని జీవీఎల్ కు ఆయన సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్రం పరిధిలోని అంశమని అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం జీవీఎల్ మానుకోవాలని హితవు పలికారు.