ramana deekshitulu: రమణ దీక్షితులు పద్ధతి బాగోలేదు... న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం: టీటీడీ ఛైర్మన్
- అమిత్ షా, జగన్ లను కలవడం సరైంది కాదు
- రోజుకో చోట ప్రెస్ మీట్లు పెడుతున్నారు
- భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అంటే తమకు ఎంతో గౌరవం ఉందని టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. అయితే, రోజుకో చోట ప్రెస్ మీట్లు పెడుతూ, ఆయన ఏదేదో మాట్లాడటం సరికాదని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వైసీపీ అధినేత జగన్ లను ఆయన కలవడం మంచి పద్ధతి కాదని తెలిపారు.
రమణ దీక్షితులుకు ఏదైనా సమస్య ఉంటే టీటీడీ పాలకమండలి దృష్టికి తీసుకురావాలని... మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. 24 ఏళ్లు ప్రధాన అర్చకుడిగా ఉండి, ఇప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని... దీని వెనుక కుట్ర ఉందని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్న రమణ దీక్షితులుపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.