Mumbai: ముంబయిలో భారీ వర్షం.. అత్యవసరమయితేనే రోడ్లపైకి రావాలని పోలీసుల సూచన
- నానా అవస్థలు పడుతోన్న ప్రజలు
- రహదారులపై వర్షపు నీరు
- మరికొన్ని రోజుల పాటు భారీ వర్షం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో భారీ వర్షం ధాటికి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 32 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరో మూడింటిని రద్దు చేశామని, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. మరోవైపు లోకల్ రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలతో రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమయితేనే రోడ్లపైకి రావాలని పోలీసులు సూచించారు. ముంబయిలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబయి మున్సిపల్ శాఖలో పనిచేసే సీనియర్ అధికారులకు వారాంతపు సెలవులను రద్దు చేశారు.