Jagan: జగన్ తో సీఎం రమేష్ నిత్యం టచ్ లో ఉంటారు: టీడీపీ నేత వరదరాజులు రెడ్డి ఆరోపణ
- వైసీపీకి సీఎం రమేష్ మద్దతుదారుడు
- ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చి టీడీపీలో చిచ్చు పెడుతున్నారు
- ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేని రమేష్ కు వర్గ రాజకీయాలు ఎందుకు?
టీడీపీ నేత సీఎం రమేష్ పై అదే పార్టీకి చెందిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీకి సీఎం రమేష్ మద్దతుదారుడని, జగన్ తో ఆయన నిత్యం టచ్ లో ఉంటారని ఆరోపించారు. ‘సీఎం రమేష్ స్థాయి పంచాయతీ ఎన్నికలకు ఎక్కువ, మండలి ఎన్నికలకు తక్కువ. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లేని రమేష్ గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ గెలిచే స్థానాల్లో కూడా ఓడిపోయేలా సర్వనాశనం చేసింది ఆయనే.
సీఎం చంద్రబాబునాయుడి దయ వల్లే ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. నామినేటెడ్ పదవులతో పబ్బం గడుపుకునే రమేష్ కు వర్గ రాజకీయాలు ఎందుకు? ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన రమేష్ టీడీపీలో చిచ్చు రేపుతున్నారు. కుందూ-పెన్నా వరద కాలువ పనుల్లో ఐదు శాతం మామూళ్లు ఇవ్వాలని రమేష్ డిమాండ్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
కాగా, గత నాలుగేళ్లుగా సీఎం రమేష్, వరదరాజులు రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్టు సమాచారం. రెండేళ్ల క్రితం జరిగిన ఓ ఉపఎన్నిక సమయంలో ఈ విభేదాలు బయటపడ్డాయని, వీరి మధ్య వ్యాపారపరమైన వైరం కూడా ఉందని అంటారు. తనకు రావాల్సిన కాలువ తవ్వకాల బిల్లుల చెల్లింపులు అందకుండా రమేష్ అడ్డుకుంటున్నారని వరదరాజులు రెడ్డి మండిపడుతున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం.