priyanka chopra: ఇటీవలి నా ‘క్వాంటికో’ ఎపిసోడ్ తో మనోభావాలు గాయపడి ఉంటే మన్నించండి: ప్రియాంక చోప్రా
- భారతీయుల మనోభావాలను గాయపరిచే ఉద్దేశ్యం లేదు
- భారతీయురాలిగా నేను గర్విస్తాను
- అది ఎప్పటికీ మారదు
- వివాదాస్పద క్వాంటికో ఎపిసోడ్ పై ప్రియాంక వివరణ
ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా తన తాజా అమెరికన్ టీవీ సిరీస్ ఎపిసోడ్ ‘క్వాంటికో’కు సంబంధించి అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతీయులను టెర్రరిస్టులుగా చూపించగా, దానిపై విమర్శలు వచ్చాయి. దీంతో ట్విట్టర్ లో ఆమె స్పందించారు. భారత ప్రజల మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశం తనకు ఏ కోశాన లేదన్నారు. భారతీయురాలిగా తాను గర్విస్తున్నానని చెప్పారు.
‘‘క్వాంటికో తాజా ఎపిసోడ్ భారతీయుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఓ భారతీయురాలిగా నేను గర్వపడుతున్నాను. అది ఎప్పటికీ మారదు’’ అని ట్వీట్ చేశారు. ఆమె తాజా క్వాంటికో ఎపిసోడ్ జూన్ 1న ప్రసారమైంది. వివాదాస్పద కథనంలో నటించేందుకు భారతీయురాలైన ప్రియాంక చోప్రా ఎలా అంగీకరించిందని ఆమె అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు సంధించారు. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక క్వాంటికో సిరీస్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు సహా ఏబీసీ స్టూడియోస్ సైతం ఈ విషయంలో ఇప్పటికే క్షమాపణలు చెబుతూ,ప్రకటన విడుదల చేసింది.