balakrishna: అభిమానుల కోలాహలం మధ్య బర్త్ డే కేక్ కట్ చేసిన బాలయ్య
- 58వ పడిలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ
- బసవ తారకం కేన్సర్ ఆసుపత్రిలో సందడి
- భారీగా తరలి వచ్చిన అభిమానులు
ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు 58వ పడిలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం బాలకృష్ణ వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. చిన్నారులతో కలిసి 58 కేజీల బర్త్ డే కేక్ కే బాలయ్య కట్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ, నాడు తన తల్లి కేన్సర్ వ్యాధితో బాధపడ్డారని, పేదలకు కేన్సర్ చికిత్సను తక్కువ ధరకే అందించాలన్న ఆమె కోరిక మేరకు బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని స్థాపించడ జరిగిందని చెప్పారు. ఈ ఆసుపత్రిలో అధునాతన పరికరాలు సమకూర్చామని, ఒకప్పుడు 40 పడకల ఆసుపత్రి ఇప్పుడు 515 పడకలకు చేరిందని, రోజురోజుకూ కేన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం బాధాకరమని, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనూ బసవ తారకం కేన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు.
తన తండ్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని నినదించిన తన తండ్రి, కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. ఎన్టీఆర్ పేరు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా ఉంటుందని, ప్రజలకు ఏదైనా సేవల చేయాలన్న దృఢ సంకల్పం ఎన్టీఆర్ సొంతమని ప్రశంసించారు. తన పుట్టినరోజున అభిమానులు రక్తదానం చేయడం సంతోషకరనమి, నందమూరి అభిమానులు ఇతరులకు ఆదర్శంగా ఉంటారని అన్నారు.