army: సరిహద్దుల్లో చొరబాటు యత్నం భగ్నం... ఐదుగురు ఉగ్రవాదుల హతం
- జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో కేరణ్ సెక్టార్ లో ఘటన
- ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం
- కాల్పులతో అడ్డుకున్న ఆర్మీ
పాకిస్తాన్ మరోసారి భారత్ లోకి ఉగ్రవాదులను పంపే ప్రయత్నం చేసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నియంత్రణ రేఖ వద్ద భారత్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం ఈ రోజు భగ్నం చేసింది. కాల్పులతో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీనిపై రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేస్ కాలియా ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘కుప్వారా జిల్లాలో కేరణ్ సెక్టార్ పరిధిలో సరిహద్దుల వద్ద చొరబాటు యత్నాన్ని ఆర్మీ విచ్ఛిన్నం చేసింది. ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు ఐదుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు’’ అని తెలిపారు. రంజాన్ మాసం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యల్ని నిలిపివేశాయి. అయినప్పటికీ సరిహద్దుల ఆవల నుంచి ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు నిరంతరం నిఘాతో అప్రమత్తంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ ఘటన వెలుగు చూసింది.