Jagan: వైసీపీకి పోలీస్ శాఖ ఇచ్చిన నోటీస్ తో ప్రభుత్వానికి సంబంధం లేదు: టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి
- రాజమండ్రి బ్రిడ్జిపై పాదయాత్రకు అనుమతినివ్వని పోలీస్ శాఖ
- గతంలో చంద్రబాబు పాదయాత్రకూ అనుమతినివ్వలేదు
- భద్రతాకారణాల రీత్యా నాడు మాకు నోటీస్ లిచ్చారు
వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర రేపు తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీదుగా జగన్ రాజమండ్రి చేరుకోవాలి. అయితే, వంతెన పరిస్థితి సరిగా లేదని పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదంటూ వైసీపీ ప్రతినిధులకు రాజమండ్రి డీఎస్పీ ఓ నోటీస్ పంపారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇది ప్రభుత్వ కుట్ర అంటూ విమర్శించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, పోలీస్ శాఖ ఇచ్చిన నోటీస్ తో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు కూడా భద్రతా కారణాల రీత్యా ఈ బ్రిడ్జిపై నుంచి రావొద్దంటూ తమకు నోటీస్ లు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, ఈ నెల 12న జగన్ పాదయాత్రలో ఎలాంటి మార్పు లేదని, రోడ్ కమ్ రైలు బ్రిడ్జి మీదుగా ఆయన రాజమండ్రి చేరుకుంటారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిన్న స్పష్టం చేశారు. జగన్ పాదయాత్రపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.