Chandrababu: ‘పోలవరం’ను 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేసి తీరుతాం: సీఎం చంద్రబాబు
- ఎన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం
- పోలవరంలో డయాఫ్రం వాల్ పూర్తి చేయడం ఒక చరిత్ర
- ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు నీరందుతుంది
‘పోలవరం’ పూర్తయ్యే వరకూ తనకు సోమవారం పోలవారమేనని, 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని, ఎన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పూర్తి అయిన సందర్భంగా పైలాన్ ను ఆవిష్కరించారు. డయా ఫ్రం వాల్ ను జాతికి అంకితం చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.
ఈ సందర్భంగా డయాఫ్రం వాల్ ను పరిశీలించిన చంద్రబాబు.. ఇంజనీర్లను, గుత్తేదార్లను అభినందించారు. అనంతరం, స్పిల్ ఛానెల్ వద్ద పదమూడు జిల్లాల రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, పోలవరంలో డయాఫ్రం వాల్ పూర్తి చేయడం ఒక చరిత్ర అని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు నీరందుతుందని అన్నారు. నదుల అనుసంధానంతో నీటి కరవును పారద్రోలుతామని చెప్పిన చంద్రబాబు, ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం తన జీవితాశయమని అన్నారు. రెండు నదులు అనుసంధానం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, వంశధార, నాగావళి, పెన్నా, గోదావరి నదుల అనుసంధానం కూడా చేస్తామని, వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.