Rahul Gandhi: పారిశ్రామికవేత్తలకు కోట్లకు కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారు: మోదీ సర్కారుపై రాహుల్ ఆగ్రహం
- దేశంలో రైతులు ఎంతగానో శ్రమిస్తున్నారు
- కానీ వాళ్లకు ఫలితం దక్కడం లేదు
- బ్యాంకుల ఎన్పీఏలు వెయ్యి కోట్లకు పైగా దాటిపోయాయి
- ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు
దేశంలో రైతులు ఎంతగానో శ్రమిస్తున్నారని, కానీ వాళ్లకు ఫలితం దక్కడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్డీఏ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ... ఓవైపు మోదీ సర్కారు పారిశ్రామికవేత్తలకు కోట్లకు కోట్లు రుణాలు మాఫీ చేస్తోందని, రైతులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు.
బ్యాంకుల ఎన్పీఏలు వెయ్యి కోట్లకు పైగా దాటిపోయాయని, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని రాహుల్ గాంధీ అన్నారు. 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.2.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, కానీ రైతులకు ఈ సర్కారు చేసిందేమీ లేదని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వాళ్ల పిల్లలు అన్యాయమైపోతున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.