tajmahal: మొఘలుల కాలం ముగిసిందిగా.. తాజ్ మహల్ పేరు మార్చండి!: యూపీ బీజేపీ ఎమ్మెల్యే
- మన నేలపై ఉన్న మొఘలుల కట్టడాలను కూల్చొద్దు
- కానీ, వాటి పేర్లను మార్చుకుందాం
- నేనైతే తాజ్ మహల్ కు ‘రాష్ట్ర భక్తి మహల్’ అని పేరు పెడతా
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వారిని బూటుతో మొహం మీద కొట్టండంటూ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి, ఆయన దృష్టి తాజ్ మహల్ పేరుపై పడింది. లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొఘలుల కాలం ముగిసిన తర్వాత కూడా మన దేశంలోని రహదారులకు, చారిత్రక కట్టడాలకు వారి పేర్లు ఉండటం కరెక్టు కాదని అన్నారు.
తాజ్ మహల్ పేరును రామ్ మహల్ లేదా కృష్ణ మహల్ గా మార్చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, మన నేలపై మొఘలుల కట్టడాలు ఉన్నాయి కనుక వాటిని కూల్చేందుకు వీలు లేదని, అందుకు బదులుగా వాటి పేర్లు మారిస్తే సరిపోతుందని సూచించారు. ఒకవేళ తాజ్ మహల్ పేరును మార్చే అవకాశం తనకు లభిస్తే దాని పేరును ‘రాష్ట్ర భక్తి మహల్’ అని నామకరణం చేస్తానని చెప్పడం గమనార్హం. మన దేశంలో ఉన్న మొఘల్ కట్టడాల్లో ఒక దానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెడితే ఆ అనుభూతే వేరని, అద్భుతంగా ఉంటుందని సురేంద్ర సింగ్ సూచించారు.