Jagan: 2003లో వైఎస్, 2013లో షర్మిల, నేడు జగన్... చారిత్రక ఘట్టం!
- నేడు తూర్పు గోదావరి జిల్లాలోకి జగన్ పాదయాత్ర
- రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా సాగనున్న యాత్ర
- వైఎస్ రాజశేఖరరెడ్డి, షర్మిల పాదయాత్రలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు
రాజమండ్రి పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చే కట్టడాల్లో ముందుండేది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్... కింద రైళ్లు ప్రయాణిస్తుంటే, పైన వాహనాలు వెళ్లే ఈ వంతెన నేడు మరో చారిత్రక ఘట్టానికి నాందిగా నిలవనుంది. వైఎస్ కుటుంబం నుంచి మరో నేత ఈ రైల్ కం రోడ్ బ్రిడ్జ్ మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి పాదయాత్రగా రానున్నారు.
ప్రజా సమస్యల గురించి తెలుసుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 'ప్రజా ప్రస్థానం' పేరిట పాదయాత్ర చేపట్టిన వేళ, 2013, జూన్ 4న ఆయన యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా దాటి ఈ వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆపై వైఎస్ఆర్ పాదయాత్రను గుర్తు చేస్తూ, ఆయన కుమార్తె, జగన్ సోదరి షర్మిల 'మరో ప్రజా ప్రస్థానం' యాత్రను చేపట్టి, 2013 జూన్ 4న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు.ఇక తన ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను ముగించుకున్న జగన్, నేడు ఇదే వంతెనపై నుంచి నడుస్తూ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుండటంతో ఈ క్షణాలను ఓ చారిత్రక ఘట్టంగా వైకాపా శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. ఇప్పటికే జగన్ కు స్వాగతం పలుకుతూ, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో వంతెన పొడవునా ప్లెక్సీలు వెలిశాయి.జగన్ నడుస్తున్న వేళ కింద గోదావరిలో వైకాపా జెండాలతో అలంకరించబడిన 600 పడవలు ఆయన్ను అనుసరించే ఏర్పాటు చేశారు. బ్రిడ్జి రెయిలింగ్ పై 7 అడుగుల ఎత్తు, 3.5 కిలోమీటర్ల పొడవైన వైకాపా జెండా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుండగా, నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న చీరలను ధరించిన 150 మంది మహిళలు, జగన్ కు 150 గుమ్మడికాయలతో దిష్టి తీసి, హారతిచ్చి, జిల్లాలోకి స్వాగతం పలకనున్నారు. ఆపై కోటిపల్లి బస్తాండ్ లో మూడంచెల వేదికను ఏర్పాటు చేయగా, ఇదే వేదికపై నుంచి జగన్ ప్రసంగించనున్నారు. ఇక అమ్మాయిల వీణానాదం, తీన్ మార్ డ్యాన్సులు, గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాల సందడి సరేసరి. వంతెనపై జగన్ నడిచే వేళ, పార్టీ జెండాలు ఆకాశంలో ఎగిరేలా బెలూన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.