Narendra Modi: అద్వానీకి మోదీ గౌరవం ఇవ్వట్లేదు: రాహుల్ గాంధీ
- మోదీ కన్నా మా పార్టీయే అద్వానీని ఎక్కువ గౌరవిస్తోంది
- గతంలో ఎన్నికల్లో వాజ్‌పేయికి ప్రత్యర్థి పార్టీగా పోటీ చేశాం
- ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగోలేదు
- కాంగ్రెస్ సైనికుడిని కాబట్టి వెళ్లి కలిశాను
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ గురువు అని, కానీ, ఆయనకు మోదీ గౌరవం ఇవ్వట్లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయనను మోదీ కన్నా తమ పార్టీయే ఎక్కువ గౌరవిస్తోందని చెప్పారు. ఈరోజు ముంబయిలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తాము గతంలో ఎన్నికల్లో వాజ్‌పేయికి ప్రత్యర్థి పార్టీగా పోటీ చేశామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే తాను వెళ్లి ఆయనను కలిశానని, ఎందుకంటే తాను కాంగ్రెస్ సైనికుడినని వ్యాఖ్యానించారు.
వాజ్‌పేయి మన దేశం కోసం పనిచేశారని, ఆయనను తాము గౌరవిస్తామని, ఇది మన సంస్కృతని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఒక సీనియర్ రాజకీయ నాయకుడు తనని కలిసి ఓ విషయం చెప్పారని, 50 ఏళ్లుగా తాను కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పని చేస్తున్నానని అన్నారని, కానీ దేశాన్ని సురక్షితంగా ఉంచే పార్టీ కాంగ్రెసేనని తాను ఇప్పుడు తెలుసుకున్నానని అన్నారని రాహుల్ అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓడిస్తుందని అన్నారు.
ఇటీవల కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందని, గుజరాత్లో కొద్ది తేడాతో అధికారాన్ని మళ్లీ నిలబెట్టుకుందని, త్వరలో జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఓడిస్తాయని రాహుల్ అన్నారు. అలాగే, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు.