Vijay mallya: విజయ్ మాల్యాతోపాటు వారిని కూడా తీసుకెళ్లండి.. భారత్కు షాకిచ్చిన బ్రిటన్
- బ్రిటన్లోని అక్రమ వలసదారుల్లో అత్యధికులు భారతీయులే
- దేశం నుంచి వారిని పంపించేందుకు సహకరించాలన్న బ్రిటన్
- ఆర్థిక నేరగాళ్లను రప్పించడంలో కొత్త చిక్కు
దేశంలోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్కు పారిపోయి తలదాచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు బ్రిటన్ గండికొట్టింది. అతడిని అప్పగిస్తామంటూనే మెలిక పెట్టింది. ప్రస్తుతం బ్రిటన్లో 75 వేల మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు భారతీయులే. వారందరినీ దేశం నుంచి పంపించేందుకు సహకరిస్తేనే వారిని అప్పగిస్తామని షరతు పెట్టింది.
దేశంలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న వలసదారుల బహిష్కరణపై బ్రిటన్ ప్రభుత్వంతో కేంద్రం ఓ ముసాయిదాను రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్లో బ్రిటన్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ అవగాహన పత్రంపై సంతకం చేయలేదు. ఇదే విషయమై బ్రిటన్ మంత్రి బరోనెస్ విలియమ్స్ సోమవారం కేంద్రమంత్రి కిరణ్ రిజిజుతో మాట్లాడారు. తమ దేశంలోని అక్రమ వలసదారులను బహిష్కరించే విషయంలో తమ వాదనను గౌరవించకపోతే బ్రిటన్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్లను అప్పగించే విషయంలో పునరాలోచించుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పినట్టు సమాచారం.