Srisailam: వర్షాల ఎఫెక్ట్... నెమ్మదిగా నిండుతున్న రిజర్వాయర్లు!
- ఎగువన కురుస్తున్న వర్షాలు
- పలు ప్రాజెక్టులకు వస్తున్న వరద నీరు
- రైతుల అవసరాలకు నీటి విడుదల
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్, జూరాల ప్రాజెక్టులకు వరద కొనసాగుతుండటం, వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతూ ఉండటంతో రిజర్వాయర్లు నెమ్మదిగా నిండుతున్నాయి. ఈ ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద 13,690 క్యూసెక్కులుగా, జూరాలకు 2,808 క్యూసెక్కులుగా వరద నమోదైంది.
శ్రీరాంసాగర్ లో 46.95 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జూరాలలో 8.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న నీటికి, కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు తోడు కావడంతో శ్రీశైలానికి 5 వేల క్యూసెక్కులకు పైగా, నాగార్జున సాగర్ కు 8 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చి చేరుతోంది. రైతుల అవసరాల నిమిత్తం రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వదులుతున్నారు. ఇక నారాయణపూర్ రిజర్వాయర్ కు 11,720 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 12,067 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.