Chandrababu: ఒక ఇంజినీర్ చేయాల్సిన పనిని చంద్రబాబు చేయడం ఏమిటి?
- రాష్ట్రాన్ని పాలించాలంటూ చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చారు
- ఆయనేమో ప్రతి సోమవారం పోలవరంకు వెళ్తున్నారు
- వ్యాపార ప్రయోజనాల కోసమే సింగపూర్ తో ఒప్పందాలు
రాష్ట్రాన్ని పాలించమంటూ ఏపీ ప్రజలు చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా అధికారమిచ్చారని... ఆయనేమో ప్రతి సోమవారం ఒక సూపరింటెండెంట్ లా పోలవరంకు వెళ్తుండటం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. ఒక ఇంజినీర్ చేయాల్సిన పనిని ముఖ్యమంత్రి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంలో చంద్రబాబు నిష్ణాతుడని దుయ్యబట్టారు. వ్యాపార ప్రయోజనాలతోనే సింగపూర్ తో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని... సారవంతమైన భూములను సింగపూర్ కు రాసిచ్చే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ఒక ప్రజా ఉద్యమంలా సాగుతోందని బుగ్గన అన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిమానం, చంద్రబాబుపై ఉన్న అపనమ్మకమే ఇంతటి భారీ స్పందనకు కారణమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్సులు రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని అన్నారు.