dhoni: ఫిట్ నెస్ కోసం ఎన్నో త్యాగాలు చేశానంటున్న ధోనీ
- చికెన్, చాక్లెట్స్, మిల్క్ షేక్స్ కు దూరమయ్యా
- టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకున్నా
- చికెన్ కు సంబంధించి కబాబ్ లు మాత్రమే తీసుకుంటున్నా
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యతను ఇస్తాడో అందరికీ తెలిసిందే. వికెట్ల మధ్య పరుగెత్తడంలో ధోనీతో యువ క్రికెటర్లు కూడా పోటీ పడలేరని చెప్పడం అతిశయోక్తి కాదు. పలు సందర్భాల్లో ఇది రుజువైంది. అయితే, ఫిట్ గా ఉండటం కోసం తాను ఎన్ని త్యాగాలు చేశాడో ధోనీ చెప్పుకొచ్చాడు. తనకు ఎంతో ఇష్టమైన చికెన్, చాక్లెట్స్, మిల్క్ షేక్స్ కు దూరమయ్యానని చెప్పాడు. ఓ అవార్డుల ఫంక్షన్ లో మాట్లాడుతూ ధోనీ ఈ విషయాన్ని వెల్లడించాడు.
మెరుగైన ఫలితాలను సాధించాలంటే, తన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంతర్జాతీయ క్రెకెట్ లోకి అడుగుపెట్టినప్పుడే అనుకున్నానని ధోనీ చెప్పాడు. 'బటర్ చికెన్, సాఫ్ట్ డ్రింక్స్ బాగా తీసుకునేవాడిని... ఎప్పుడైతే 28 ఏళ్ళు వచ్చాయో అప్పటి నుంచి చాక్లెట్లు, మిల్క్ షేక్స్ తీసుకోవడం మానేశా... ఆ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ కు దూరమయ్యా... టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకున్నా' అని తెలిపాడు. చికెన్ కు సంబంధించి కబాబ్స్ మాత్రమే తీసుకుంటున్నానని చెప్పాడు.