Kerala: 'చెత్త' పనులపై జడ్జి వినూత్న నిరసన!
- ‘క్లీన్ ఎర్నాకుళం సిటీ’లో భాగంగా మార్కెట్ కు వెళ్లిన సబ్ జడ్జి
- అక్కడ పేరుకుపోయిన చెత్తను చూసి ఆశ్చర్యపోయిన వైనం
- ఆ చెత్తకుప్ప పక్కనే కుర్చీ వేసుకుని న్యాయమూర్తి నిరసన
కేరళలోని ఎర్నాకుళం మార్కెట్లో భారీ ఎత్తున చెత్త పేరుకుపోవడంపై కొచ్చి సబ్ జడ్జి ఏఎం బషీర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ‘క్లీన్ ఎర్నాకుళం సిటీ’ ప్రాజెక్టులో భాగంగా పరిశీలనకై అక్కడి మార్కెట్ కు ఆయన వెళ్లారు. అయితే, ఆ మార్కెట్ లో ఓ మూల చెత్త కుప్ప ఉండటాన్ని ఆయన గమనించారు. ఈ విషయమై మార్కెట్ వ్యాపారులను, సిబ్బందిని విచారించగా కొన్ని రోజులుగా చెత్తను తొలగించే సిబ్బంది రావడం లేదని చెప్పారు.
దీనిపై అసహనం వ్యక్తం చేసిన బషీర్, ఉన్నపళంగా నిరసనకు దిగారు. ఆ చెత్తకుప్ప పక్కనే కుర్చీ వేసుకుని, ఆ దుర్వాసన బారిన పడకుండా ఓ మాస్క్ ధరించి కూర్చున్నారు. కొన్ని గంటల పాటు అలాగే తన నిరసన కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ చెత్తను తొలగించారు. అయితే, మార్కెట్లో చెత్తను తొలగించడం లేదన్న మాట వాస్తవం కాదని, ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని చెప్పి కొచ్చి కార్పొరేషన్ అధికారులు సమర్థించుకున్నారు.